- డీఈఈని సస్పెండ్ చేసిన హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ
హైదరాబాద్, వెలుగు: కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇండ్ల తనిఖీల సమాచారాన్ని ముందుగానే లబ్ధిదారులకు లీక్ చేసిన హౌసింగ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ) చంద్రపాల్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ఆఫీసర్లు తనిఖీలకు వస్తున్నారని, లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇండ్లలోనే ఉండాలని ముందే సమాచారం ఇచ్చినట్లు విచారణలో తేలింది. దీంతో విధుల్లో నిర్లక్ష్యం, అధికారిక సమాచార గోప్యత పాటించకపోవడంపై హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ మంగళవారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.
కొల్లూరులో మొత్తం 18 వేల డబుల్ బెడ్రూం ఫ్లాట్లు ఉండగా, ఇటీవల వెలుగు దినపత్రిక కథనం ప్రకారం సుమారు 8 వేల మంది మాత్రమే నివాసం ఉంటున్నారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారికి ఇండ్లు కేటాయించినా చాలామంది అక్కడ ఉండటం లేదని అధికారులకు ఫిర్యాదులు అందాయి. కొందరు ఇండ్లను ఇతరులకు అద్దెకు ఇవ్వడం, ఖాళీగా ఉంచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే పలుమార్లు తనిఖీలు చేసి, నివాసం ఉండని వారికి నోటీసులు జారీ చేసింది.
నోటీసులకు పలువురు తాము కేటాయించిన ఇండ్లలోనే ఉంటున్నామని సమాధానం ఇవ్వడంతో అసలు పరిస్థితిని తెలుసుకునేందుకు అధికారులు ఆకస్మిక తనిఖీలకు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా సెలవు రోజైన ఆదివారం పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ సమాచారాన్ని చంద్రపాల్ ముందుగానే లబ్ధిదారులకు చేరవేసినట్లు ప్రచారం జరగడంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. సమాచార లీకేజీ నిజమేనని తేలడంతో ఆయనపై చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇండ్లలో అర్హులైన లబ్ధిదారులే స్వయంగా నివాసం ఉండాలని ఎండీ గౌతమ్ స్పష్టం చేశారు. ఇతరులకు అద్దెకు ఇచ్చినా, విక్రయించినా నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ పథకం లక్ష్యం దెబ్బతినకుండా ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.
